Indic Varta

  • Visitor:5
  • Published on:
  • 2 min read
  • 0
  • 0

ఈ ఆర్టికల్ లో ఖలీద్ ఉమర్ భారత దేశం ‘హిందూ రాష్ట్రం ‘ గా మారడానికి ఉన్న అవకాశం గురించి వ్రాసారు. ఉదారవాదులు తరచూ భారత దేశం హిందూ రాష్ట్రం గా మారితే అల్ప సంఖ్యాకుల మారణ హోమం జరుగుతుంది అని భయంకరమైన కథలను ప్రచారం చేస్తుంటారు. కానీ ఈ రచయిత మాత్రం భారత దేశం హిందూ రాష్ట్రం గా అవతరిస్తే హిందూ సంస్కృతి యొక్క గొప్పదనం కారణంగా శాంతి నెలకొని, అక్కడ నివసించే అన్ని వర్గాలకు చెందిన ప్రజలూ పురోగమిస్తారని అభిప్రాయపడ్డారు.

భారత దేశం హిందూ రాష్ట్రం అయితే తప్పేముంది? – ఖలీద్ ఉమర్

రేంద్ర మోడీ మరియు భారతీయ జనతా పార్టీ కలిసి భారత దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’ గా మార్చడానికి ప్రయత్నిస్తునారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక వేళ అదే నిజమయితే, అందులో తప్పేముందని నా ప్రశ్న.

ఐదు వేల సంవత్సరాల నాగరికతను కలిగి, ప్రపంచంలోని 95 శాతం హిందువులకు  ఆశ్రయమిస్తున్న  భారత దేశం ప్రపంచంలో సనాతన ధర్మానికి పుట్టినిల్లు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భారత దేశం తనని తాను ‘హిందూ రాష్ట్రం’ గా ప్రకటించుకోవడానికి ఏమాత్రం సిగ్గు పడాల్సిన అవసరం లేదు. క్రైస్తవం, ఇస్లాం తరువాతః హిందూమతం ప్రపంచంలోని మూడవ అతి పెద్ద మతం. కానీ అది మొదటి రెండు మతాల లాగా ప్రపంచ పటం లో ఎక్కువ ప్రాంతాలలో వ్యాప్తి చెందలేదు. ప్రపంచంలోని 97 శాతం మంది హిందువులు భారత్, నేపాల్, మారిషస్ దేశాలలోనే నివసిస్తున్నారు. మిగిలిన అన్ని ముఖ్యమైన మతాలతో పోలిస్తే, హిందూ మతం భౌగోళికంగా చాలా తక్కువ విస్తీర్ణంలో మనుగడలో ఉంది. 95 శాతం హిందువులు (ఆ మతానికి పుట్టినిల్లు అయిన) భారత దేశంలో నివసిస్తూ ఉంటే, ఇస్లాం కి పుట్టినిల్లు అయిన అరేబియా లో మాత్రం కేవల   1.6  శాతం ముస్లీములు మాత్రమే నివసిస్తున్నారు.

వామపక్ష ఉదార వాదులకు ప్రపంచంలో ఉన్న 53 ఇస్లామిక్ దేశాలతో (వాటిలో  27 దేశాలు ఇస్లాం ని అధికార మతంగా ప్రకటించుకున్నవి ), అలాగే వందకు పైగా ఉన్న క్రైస్తవ దేశాలతో ఎలాంటి సమస్యా లేదు.  ప్రపంచంలోని పదిహేను దేశాలలో క్రైస్తవం అధికార మతం. వాటిల్లో ప్రముఖమైనవి ఇంగ్లాండ్, గ్రీస్, నార్వే, డెన్మార్క్, హంగరీ మొదలైనవి. అలాగే ప్రపంచంలో బౌద్ధ మతాన్ని అనుసరించే దేశాలు ఆరు ఉన్నాయి. ఇజ్రాయెల్ యూదు రాజ్యము. కానీ భారత దేశం విషయానికి వస్తే మాత్రం దానిని హిందూ రాష్ట్రం గా అంగీకరించకపోవడానికి వాళ్ళకున్న హేతుబద్ధత ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.

ప్రపంచం లో ఏ మతానికి చెందిన దేశానికి వెళ్ళినా మనకి అక్కడ హిందువులు కనబడతారు. హిందూ మతం లో ‘మత మార్పిడి’ అన్న ఆలోచన లేదు. ప్రపంచంలో ముస్లీములు, క్రైస్తవులకు సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘన, వాళ్ళ మీద జరుగుతున్న మత పరమైన దాడుల మీద గొంతెత్తి ప్రశ్నించే క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. మయన్మార్, పాలస్తీనా, యెమెన్ వంటి దేశాలలో జరిగిన మత పరమైన దాడులను గుర్తు పెట్టుకున్న ప్రపంచం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఇతర ఇస్లామిక్ దేశాలలో హిందువులు, సిక్ఖులను మాత్రం గుర్తుపెట్టుకోదు. 1971 లో బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం జన హననం చేసినప్పుడు హిందువుల పరిస్థితి, 1998 లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని వాన్దామా  గ్రామంలో జరిగిన కాశ్మీర్ పండిట్ల నరమేధం, పాకిస్తాన్ లో  ఒక పద్దతి ప్రకారం హిందువులను అంతమొందించడం, మస్కట్ లాంటి అరబ్ దేశాలలో చారిత్రిక హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లాంటి విషయాలు ఎవరికైనా గుర్తున్నాయా?

(లౌకిక దేశంగా ప్రకటించుకున్న) భారత దేశంలో అనుసరిస్తున్న విధానాలు నిజానికి లౌకిక భావనకు విరుద్ధంగా ఉన్నాయి.  అధిక సంఖ్యాకులైన హిందువుల విషయంలో ఇక్కడ దారుణమైన వివక్ష కొనసాగుతోంది. దానికి చాలా  ఉదాహరణలు ఉన్నాయి. ‘హజ్ రాయితీ’ గురించి మీకు తెలుసా? 2000 వ  సంవత్సరం నుండి ఇప్పటి దాకా పదిహేను లక్షల మంది ముస్లీములు ఈ రాయితీని ఉపయోగించుకున్నారు. అక్కడి సర్వోన్నత న్యాయస్థానం పది సంవత్సరాల కాల వ్యవధిలో ఈ రాయితీని క్రమ క్రమంగా తొలగించమని చెప్పాల్సి వచ్చింది. ప్రపంచంలో ఏ లౌకిక రాజ్యం ఒక మత విశ్వాసానికి చెందిన ప్రజలకు మతపరమైన యాత్రలకు రాయితీ ఇస్తోంది? 2008 లో ఒక్కో ముస్లిం యాత్రికునికి ఇచ్చిన సగటు విమానయాన రాయితీ 1000 అమెరికన్ డాలర్లు.

భారత దేశం తన దేశంలోని పౌరులకు మతపరమైన యాత్రలకు రాయితీ ఇస్తుంటే, హిందూ మత చిహ్నాలను విగ్రహారాధన పేరుతో  ఖండించే సౌది అరేబియా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ‘వహాబీ తీవ్రవాదాన్ని’ వ్యాప్తి చేస్తోంది. అక్కడ హిందువులు తమ దేవాలయాలను నిర్మిచడానికి అనుమతి ఉండదు. హిందువులు చెల్లిస్తున్న పన్నులను సౌదీ అరేబియా తమ పౌరులకు యాత్రల  మీద  ఇస్తున్న రాయితీల కోసం ఉపయోగిస్తోంది.

లౌకిక రాజ్యంలో మత విశ్వాసాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలి. కానీ భారత దేశంలో వివిధ మతాలను పాటిస్తున్న పౌరులకు వివిధ చట్టాలు (పర్సనల్ లాస్ ) ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద అజమాయిషీ చేస్తుంది, కానీ మసీదులు, చర్చీలు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. హజ్ యాత్రకు రాయితీ ఉంటుంది కానీ, అమర్నాథ్ యాత్రకు, కుంభమేళాకు హిందువులకు ఎటువంటి రాయితీ ఉండదు. నిజమైన లౌకిక రాజ్యమైతే ఏ మత యాత్రకూ రాయితీలు ఇవ్వకూడదు.

హిందువులు ఎప్పుడూ మైనారిటీలను స్వాగతించి, వాళ్ళను కాపాడుతున్నారు. ఈ పరమత సహనానికి సంబంధించిన చరిత్రను ఒకసారి పరిశీలిద్దాము. ప్రపంచ వ్యాప్తంగా పార్సీల మీద మతపరమైన దాడులు జరుగుతున్నప్పుడు హిందువులు వాళ్లకి ఆశ్రయం ఇచ్చారు. వెయ్యి సంవత్సరాలకు పైగా వాళ్ళు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. 2000 సంవత్సరాల నుండి యూదులు,   1800 సంవత్సరాల నుండి సిరియా క్రైస్తవులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. హిందూ మతం నుండి ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలు 2500 సంవత్సరాల నుండి,  400 ఏళ్ళ నుండి సిక్ఖు మతం ఇక్కడ హిందువులతో కలిసి కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఒకసారి చరిత్రలోని నిజాలను పరికించి, హిందువుగా గర్వించాలి కానీ, సిగ్గు పడకూడదు అని భావించాల్సిన సమయం ఆసన్నమయింది.

ఈ రోజుకి కూడా భారత దేశం లౌకిక రాజ్యంగా ఉంది అంటే దానికి కారణం, 1976 లో రాజ్యాంగంలో చేసిన సవరణ వల్లనో,  లేకపోతే ఇక్కడి చట్టాలు, చట్ట సభల వల్లనో కాదు. అధిక సంఖ్యాకులు హిందువులు గా ఉండటంతో అది సాధ్యమయ్యింది. హిందూమతం లోనే మౌలికంగా ‘లౌకిక భావన’ ఉంటుంది. వేల సంవత్సరాల పాటు హిందువులు ఎంతో మత సహనాన్ని ప్రదర్శించిన తరువాత చేసిన చట్టం వలన వచ్చిన మార్పు కాదు ఇది. భారత దేశం బహిరంగంగా ‘హిందూ రాష్ట్రం’ (హిందూ/సిఖ్/జైన) గా ప్రకటించుకోవాలి. ప్రపంచంలోని మిగిలిన ఏ దేశమూ పట్టించుకోవడం లేదు కాబట్టి, భారతదేశం వాళ్ళ హక్కుల విషయంలో జోక్యం చేసుకోవాలి.

‘హిందూ రాష్ట్రం’ గా ప్రకటించడం వలన ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళను మత మార్పిడులు, మైనారిటీల సంతుష్టికరణల నుండి కాపాడటానికి వీలు కలుగుతుంది. లౌకిక రాజ్యంగా ఉన్నంత వరకు మాత్రమే  భారత దేశం ప్రగతిశీల దేశం గా కొనసాగ గలుగుతుంది. ఇక్కడి జనాభాలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నంతవరకు మాత్రమే లౌకిక రాజ్యంగా కొనసాగడం సాధ్యపడుతుంది. లౌకిక వాదం, హిందూ మతం అనేవి ఒకే నాణానికి రెండు పార్శ్వాల వంటివి . అలాంటి నాణాన్ని పైకి విసిరినప్పుడు అది ఎటు వైపు పడినా విజయమే లభిస్తుంది.

భారత దేశం హిందూ రాష్ట్రం గా అవతరించడం అనేది అత్యుత్తమ పరిణామం. అప్పుడు హిందువులతో సహా అందరికీ వర్తించే ‘యూనిఫాం సివిల్ కోడ్’ వస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా – ఇలా ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అంటే అక్కడ అందరికీ సమానంగా వర్తించే చట్టాలు ఉండటం వలన అది సాధ్యమయింది. మాతమార్పిడులు నిషేదించబడతాయి కాబట్టి మత ఘర్షణలు ఉండవు. తబ్లిగీలు లాంటివి ఇక ఏమాత్రం ఉండవు. మత మార్పిడులు ఉండవు కాబట్టి, ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, లేదా ఏ మతాన్నీ  పాటించకుండా ఉండిపోవచ్చు. (హిందూ మతం లోనే ‘నిరీశ్వర ఆరాధన’ అనే భావన ఉన్నది). ఏ మతాన్నీ అవలంబించని వాళ్ళని గౌరవించే ఇంకో మతాన్ని మనం చూడలేము.

ముస్లీము దురాక్రమణదారులు ఈ ప్రాంతాన్ని దండెత్తక ముందు నుంచే లౌకిక భావన, పరమత సహనం అనేవి ఇక్కడ నివసిస్తున్న ప్రజల సంస్కృతి లో భాగంగా ఉన్నాయి. సుమారు  క్రీస్తు శకం  1000 లో మొదలయిన ముస్లీముల ఆక్రమణలు 1739 దాకా అనేక శతాబ్దాల పాటు కొనసాగాయి. పది కోట్ల మంది హిందువులను ఊచకోత కోయడం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మానవ హననం. కానీ ఆ ఆక్రమణదారుల సంతతి మీద హిందువులు ఎటువంటి ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రస్తుతం హిందూ-ముస్లీముల మధ్యన ఉన్న అశాంతికి కారణం హిందూ మతం కాదు, ఇక్కడ అవలంబిస్తున్న మిధ్యా-లౌకికవాదం దానికి కారణం.  హిందూ రాష్ట్రంలో హిందువులు కాని వారి మత స్వేచ్చకు ఎటువంటి విఘాతమూ ఉండదు.

తమ దేశానికి చెందిన చరిత్రను తెలుసుకుని హిందువులు గర్వించాలి. ఘర్షణలను తొలగించడానికి వాళ్ళు నిజాలను తెలుసుకోవాలి. వాస్తవానికి దూరంగా జరిగితే తన సంస్కృతిలో భాగమైన పరమత సహనాన్ని కలిగి ఉన్న ఈ భూభాగానికి తీవ్ర నష్టం కలుగుతుంది.  ఇప్పటికే ముస్లిం దేశాల ఏర్పాటు కోసం భారత దేశం విలువైన తన భూభాగాలను త్యాగం చేసింది. లౌకిక వాదం పేరుతో ఇప్పటి దాకా భారత దేశం చాలినంత సంతుష్టికరణ ను కొనసాగించింది. ఇప్పుడు హిందువులందరూ తమకు వారసత్వంగా వచ్చిన  శాంతిని ఎలుగెత్తి చాటడానికి ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమయ్యింది.  ఎటువంటి శాసనం లేకుండానే, తన సంస్కృతిలోనే భాగంగా ఉన్న పరమత సహనాన్ని పాటించి, లౌకిక భావనకు విలువనిచ్చే  ‘హిందూ రాష్ట్రం’ ప్రంపంచంలో ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది.

ఆంగ్ల మూలం : ఖలీద్ ఉమర్

తెలుగు అనువాదం :  శేషశాయి దీవి

Published first at: https://vskandhra.org/